రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీకి మరో మారు ఘర్షణ వచ్చిపడింది. ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తుండగా ఇప్పట్లో ఎన్నికలకు వెళ్లే ఉద్దేశ్యం లేదని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అభిప్రాయపడుతోంది. మరి ఇది మరో వివాదంగానే చూడాలి. ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు ఈ ఏడాది మార్చిలో వాయిదా పడ్డాయి. ఆనాడు సడెన్ గా ఎన్నికల సంఘం ప్రధానాధికారి హోదాలో రమేష్ కుమార్ వాయిదా వేశారు. ఇపుడు మళ్ళీ అనూహ్యంగా ఆయన ఎన్నికలకు రెడీ అంటున్నారు.
దీంతో ఇపుడు ఏపీలో ఏం జరుగుతుంది అన్నది పెద్ద చర్చగా ఉంది. ఏపీ ప్రభుత్వ సహకారం లేకుండా ఎన్నికలు జరుగుతాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎన్నికలు నిర్వహించే అధికారం రాజ్యాంగబద్ధంగా ఎన్నికల సంఘానికి ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలసి మాత్రమే ఇంతవరకూ నిర్వహిస్తూ వచ్చారు.
సాధారణంగా ప్రతిపక్షాలు ఎపుడూ ఎన్నికల సంఘాన్ని నిందిస్తూ ఉంటారు. నిష్పాక్షికంగా వ్యవహరించలేదని నిందలు వేస్తూంటారు. అంటే ఎన్నికల సంఘం ప్రభుత్వం మధ్య ఎంతటి సామరస్యం ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
కానీ ఇపుడు చూస్తే మాత్రం ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని వెనకేసుకువస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం బద్ధ విరోధిగా మారుతోంది. నిజానికి ఎన్నికల సంఘం వద్ద యంత్రాంగం ఉండదు, అంతా రాష్ట్ర ప్రభుత్వమే చూడాలి. వారి అధికారులనే వాడుకోవాలి. మరి అలాంటపుడు ప్రభుత్వం కనుక సహకరించను అంటే ఏమవుతుంది. ఇది దేశంలో ఇంతవరకూ ఎక్కడా చోటు చేసుకోని పరిణామమే.
దీని మీద ఎవరికి తోచిన భాష్యాలు వారు చెబుతున్నారు. కేంద్ర బలగాలను రంగంలోకి దింపి మరీ ఎన్నికలు నిర్వహించవచ్చునని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు సూచిస్తున్నారు. సరే బందోబస్తుకు వారు సరిపోయినా మొత్తం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే నో చెబితే అపుడు ఎలా అన్నది ఒక చర్చ. మరి ఎన్నికల వేళ మొత్తం తన నియంత్రణలోకి తీసుకుని ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుందా, ఒక ప్రజా ప్రభుత్వం ఉండగా ఇలా చేయడానికి వీలు అవుతుందా అన్నది కూడా చర్చగా ఉంది. మరి కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేశామని నాడు రమేష్ కుమార్ చెప్పారు. ఇపుడు రోజుకు మూడు వేల కేసులు వస్తున్నాయి. మరి ఈ సమయంలో ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదు అని రాష్ట్ర ప్రభుత్వం అంటే దానికి ఎంతవరకూ విలువ ఉంటుంది అన్నది కూడా చూడాలి.
0 Comments