ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ ప్రకటించారు.. నవంబర్ ఒకటిని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఈమేరకు అవతరణోత్సవం నిర్వహణకు ఓ కమిటీని ఆయన నియమించారు. నవంబరు 1 తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవం గా నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వ మీడియా సలహాదారు జీవిడి కృష్ణ మోహన్ నేతృత్వంలో 9 మంది అధికారులతో కూడిన కమిటీ నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
2014 వరకూ నవంబర్ 1న రాష్ట్ర అవతరణోత్సవాలు జరిగేవి..
అయితే ఆ తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడంతో మరోసారి ఏపీ అవతరణోత్సవాలపై చర్చ మొదలైంది. ఇప్పుడు రాష్ట్ర అవతరణ ఉత్సవం నవంబర్ 1న జరపాలా..జూన్ 2న జరపాలా అన్న చర్చ మొదలైంది. అసలే జూన్ 2 ఆంధ్ర ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ విడిపోయినందువల్ల జూన్ 2ను ఉత్సవం చేసుకోలేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అప్పటి సీఎం చంద్రబాబు జూన్ 2 నుంచి జూన్ 8 వరకూ నవ నిర్మాణ దీక్షల పేరుతో గడిపేసేవారు.
అందువల్ల 2014 నుంచి ఏపీకి రాష్ట్ర అవతరణ ఉత్సవాలు లేకుండా పోయాయి. అయితే ఏ రాష్ట్రానికైనా రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటూ తప్పకుండా ఉంటుంది. అలాంటిది అవతరణ దినోత్సవం జరుపుకోలేని స్థితిలోకి ఏపీ వెళ్లింది. అందుకే ఇప్పుడు ఆ పరిస్థితిని తొలగిస్తూ.. నవంబర్ ఒకటిని మళ్లీ ఏపీ అవతరణ దినోత్సవంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం ఇప్పుడు మరో వివాదానికి దారి తీసే ప్రమాదమూ లేకపోలేదు. వాస్తవానికి అక్టోబర్ 1, 1953న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత నవంబర్ 1, 1956న తెలంగాణతో కలసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణ విడిపోయినందువల్ల నవంబర్ 1న అవతరణోత్సవం జరపాలా.. లేక ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ దాదాపు 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రమే కాబట్టి అక్టోబర్ 1న జరపాలా అన్నది చర్చకు దారి తీయొచ్చు.
0 Comments