కొమురం భీమ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కథాంశాలతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా టీజర్ వివాదం రేపుతోంది. కొమరం భీమ్ జయంతి సందర్భంగా మొన్న ఎన్టీఆర్ లుక్‌ని రివీల్ చేస్తూ టీజర్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. అయితే గతంలో రామ్ చరణ్ లుక్ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించగా, ఎన్‌టీఆర్ టీజర్‌కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించాడు. ఈ టీజరే ఇప్పుడు వివాదస్పదమయ్యింది.
టీజర్‌లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ ఈ వివాదానికి దారితీసింది. జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం పాలనపై తిరుగుబావుట ఎగరవేసిన మన్యం వీరుడి క్యారెక్టర్‌కి ఓ సామాజిక వర్గానికి సంబంధించిన టోపీ ఎలా పెడుతారని మండిపడుతున్నారు.
తాజాగా దర్శకుడు రాజమౌళికి ఎంపీ సోయం బాపు రావు వార్నింగ్ ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో భీం పాత్రకు పెట్టిన టోపీ తొలగించాలి, ఒకవేళ అలాగే విడుదల చేస్తే థియేటర్లను తగుల బెట్టె అవకాశం ఉందని అయన అన్నారు. మీ కలెక్షన్ల కోసం మా ఆరాధ్య దైవాన్ని కించ పరిస్తే సహించబోమని ఆయన అన్నారు. నైజాం కు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారని, భీం ను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమేనని అన్నారు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్ర ను తెలుసుకోవాలి, లేకుంటే మర్యాద ఉండదని ఆయన అన్నారు.
0 Comments